అక్షరటుడే, హైదరాబాద్: Real Estate Scam : రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ కుంభకోణం వెలుగు చూసింది. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో రిటర్నులు అందజేస్తామని నమ్మించి అమాయక ప్రజలను నట్టేట ముంచిన బాగోతం కూకట్పల్లి పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో లాభాలు తిరిగి అందజేస్తామని 90 మంది నుంచి రూ.12 కోట్లు వసూలు చేసి, బోర్డు తిప్పేసిన ‘వీ వన్ ఇన్ఫ్రా గ్రూప్స్(V One Infra Groups) పై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. బాధితుల ఫిర్యాదుతో కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లను సైబరాబాద్ ఓడబ్ల్యూ పోలీసులు(Cyberabad OD police) అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందంతో గాలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లాకు చెందిన సురేశ్(ఛైర్మన్).. హైదరాబాద్(Hyderabad) కూకట్ పల్లి (జేఎన్టీయూ)(Kukatpally – JNTU)) దగ్గర ‘వీ వన్ఇన్ఫ్రా గ్రూప్స్’ పేరిట కంపెనీ ప్రారంభించాడు. ఇందులో బాపట్లకు చెందిన వంశీకృష్ణ, తూర్పు గోదావరి(East Godavari) జిల్లాకు చెందిన వెంకటేశ్ డైరెక్టర్లుగా ఉన్నారు. తమ కంపెనీ స్కీముల(company’s schemes)లో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో రిటర్న్స్ ఇస్తామని జోరుగా ప్రచారం చేశారు.
Real Estate Scam : స్కీమ్ లు ఇలా..
మొదటి స్కీమ్ లో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే 25 నెలల పాటు ప్రతి నెల రూ.20 వేలు చెల్లిస్తామని, 25 నెలల ముగిసిన తర్వాత పెట్టుబడి రూ.5 లక్షలు కూడా చెల్లిస్తామని నమ్మబలికారు. గ్యారెంటీ కోసం గుంట వ్యవసాయ భూమి(agricultural land)ని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెక్కులు ఇస్తామన్నారు.
రెండో స్కీమ్ లో రూ. లక్ష పెట్టుబడి పెడితే 36 నెలల పాటు రూ.6 వేల చొప్పున చెల్లిస్తామని, స్కీము ముగిసిన తర్వాత రూ. లక్ష తిరిగి ఇస్తామన్నారు.
Real Estate Scam : వెలుగులోకి ఇలా..
పటాన్ చెరుకు చెందిన ముత్యాల గోపాల్ మొదటి స్కీములో రూ.6 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆయనకు కంపెనీ మూడు నెలల పాటు నెలకు రూ.20,000 చెల్లించింది. సదాశివపేటలో ఒక గుంట భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇచ్చింది. మూడు నెలల నుంచి రిటర్న్స్ రాకపోవడంతో కంపెనీ ప్రతినిధులను గోపాల్ ఆశ్రయించారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో కంపెనీ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయం మూసి ఉండటంతో మోసపోయినట్లు గుర్తించి, సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసుల(Cyberabad Economic Offences Wing police)కు ఫిర్యాదు చేశారు. ఇలా గోపాల్ తోపాటు మరో 25 మంది బాధితులను పోలీసులు గుర్తించారు.