అక్షరటుడే, వెబ్ డెస్క్: జిల్లాలో అడ్డగోలుగా అక్రమ వెంచర్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయినా అడ్డుకట్ట వేయడంలో ఉన్నతాధికారులు పూర్తి విఫలమవుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే నిజామాబాద్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో వేలాది గజాలకు సంబంధించిన డాక్యుమెంట్లు సృష్టించడం తీవ్ర చర్చకు దారితీసింది. నిజామాబాద్ రూరల్ మండలం సారంగాపూర్, మల్కాపూర్, ఖానాపూర్ శివార్లలోని నాలుగు అక్రమ వెంచర్లకు చెందిన దాదాపు 50వేల పైచిలుకు గజాల స్థలాలకు దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిపెట్టారు. ఓ సీనియర్ అసిస్టెంట్ ను ఇక్కడ ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ గా నియమించగా అతగాడు ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఒక్క రోజులోనే పెద్దమొత్తంలో అక్రమ వెంచర్లకు చెందిన రిజిస్ట్రేషన్లు చేయడం గమనార్హం. ముఖ్యంగా ఇందులో ఇండస్ట్రియల్ జోన్, అటవీ జోన్ పరిధిలో ఉన్న స్థలాలున్నాయి. కాగా.. ఇక్కడ నివాస స్థలాలకు అనువుగా ప్లాట్లుగా విభజించి డాక్యుమెంట్లు సృష్టించడం కొసమెరుపు. ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ రమేశ్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కాగా.. అర్బన్ కార్యాలయం పరిధిలో నకిలీ ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ పూర్తిచేసి పెట్టిన వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ తప్పిదానికి పాల్పడినట్లు తేలింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇతర అధికారులు సైతం దర్జాగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.