అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కరెంటు సరఫరా లేకపోవడంతో సోమవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంట అయినా ప్రారంభం కాలేదు. దీంతో రిజిస్ట్రేషన్‌ల వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయంలో ఇన్వర్టర్ ఉన్నా చెడిపోయింది. మరమ్మతులు చేయించకపోవడంతో మూలనపడింది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రజలు గంటల తరబడిగా వేచి చూస్తున్నారు. వందల కోట్ల రూపాయలు ఆదాయం సమకూరే శాఖలో ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం. గతంలోనూ ఇదే సమస్య ఏర్పడిందని, దూర ప్రాంతాల నుంచి ఇబ్బందులు పడుతున్నామని రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు చెబుతున్నారు.