అక్షరటుడే, హైదరాబాద్: SC classification : అణగారిన వర్గాల ఆశ, ఆవేదన, నిరీక్షణకు తెరపడింది. దశాబ్దాల పోరాటం.. ఎందరో ఉద్యమకారుల త్యాగ ఫలం.. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎస్సీల్లోనే విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో అసమానతలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్న మాదిగ కులస్తుల మోముల్లో ఆనందం వికసించింది. తమ జీవితాలను త్యాగం చేసి పోరాడినందుకు, ఇన్నేళ్లకైనా తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని సంబరం వ్యక్తం చేస్తున్నారు.
SC classification : అసలు ఏమిటీ వర్గీకరణ..
షెడ్యూల్డ్ కులాల కోటాను కులాల వారీగా వర్గీకరించడాన్ని ఎస్సీ వర్గీకరణగా చెబుతారు. షెడ్యూల్డ్ కులాల కోటాలో ఉద్యోగాలు, అవకాశాలు మాల కులస్తులకే ఎక్కువగా లభిస్తున్నాయని, సమ న్యాయం కోసం షెడ్యూల్డ్ కులాల కోటాను దామాషా ప్రకారం వర్గీకరించాలనేది మాదిగ కులస్తుల డిమాండ్. ఎస్సీ వర్గీకరణ అనేది సామాజికంగానే కాకుండా న్యాయపరంగా, రాజకీయంగానూ నలిగిన అంశంగా చెప్పొచ్చు.
SC classification : 2011 జనాభా గణాంకాల ప్రకారం..
ఎస్సీలు 1,38,78,078 మంది ఉన్నారు. వీరిలో 67,02,609 మంది మాదిగలు, 55,70,244 మంది మాలలు. అంటే మాలలకన్నా దాదాపు 11.3 లక్షలు ఎక్కువగా మాదిగల జనాభా ఉంది. మొత్తం ఎస్సీ జనాభాను తీసుకుంటే.. అందులో ఈ మాల, మాదిగ కులస్తులే 80 శాతం వరకు ఉండొచ్చనేది అంచనా. మిగతా 57 కులాల్లో రెల్లి కులానిది పెద్ద సంఖ్యగా పేర్కొనవచ్చు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు.
SC classification : ఊరికి అవతల వెలివేయబడి..
ఎస్సీ కులాల వారందరూ వెలివేయబడటంతో ఊరికి అవతల దూరంగా నివసించేవారు. అప్పటి పెత్తందారుల సమాజంలో దారుణమైన అణచివేతను, అంటరానితనాన్ని, వివక్షను ఎదుర్కొన్నారు.
SC classification : వీరిలోనూ అసమానతలు..
ఎస్సీల్లోనూ ఎక్కువ, తక్కువలనే అసమానతలు ఉన్నాయి. మాదిగ కులస్తులను మాలలు తక్కువగా చూస్తారు. కానీ, ఎస్సీ జనాభాలో మాలల కన్నా.. మాదిగలు అధికంగా ఉన్నా కూడా స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు.. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో వారికి అన్యాయం జరుగుతుందని అప్పట్లో కొందరు మేధావులు గుర్తించారు. 70 శాతం ఉన్న మాదిగ, మాదిగ ఉపకులాల వారు 10 శాతం రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతుంటే, 30 శాతం ఉన్న మాలలకు 90 శాతం లబ్ధి చేకూరుతుందని వారు అభిప్రాయ పడ్డారు.
SC classification : 1994లో ఉద్యమం..
అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారినికి ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఎన్నో వేదికలు, సంస్థలు ఏర్పడ్డాయి. అందులో ప్రధానమైనది మంద కృష్ణ మాదిగ స్థాపించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS). 1994లో మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మొదలు పెట్టి మాదిగల హక్కుల కోసం పోరాటానికి నాంది పలికారు. పాదయాత్ర చేశారు. సభలు పెట్టారు. ఊరూ వాడా తిరిగారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని, తమ వాటా దక్కాల్సిందేనంటూ మాదిగలను చైతన్య పరిచారు.
SC classification : గ్రూపులుగా..
ఎస్సీ కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించి ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం ఉన్న రిజర్వేషన్ కోటాను పెంచాలనేది మంద కృష్ణ మాదిగ డిమాండ్. బీసీల్లో ఉన్న ఏ, బీ, సీ, డీ వర్గీకరణ మాదిరిగానే ఎస్సీ కులాలను కూడా వర్గీకరించి అన్ని రకాలుగా నష్టపోతున్న మాదిగలకు న్యాయం చేయాలంటూ.. 1972 నుంచి మొదలుకుని మారిన ప్రతి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు. మాదిగ జాతి నష్టపోతున్న తీరును అర్థమయ్యేలా వివరించి ఎస్సీ వర్గీకరణ చేయాలని ఏ ముఖ్యమంత్రిని కోరినా.. ఈ అంశంపై ముందడుగు వేయడానికి ఎవరూ సాహసం చేయలేదు.
SC classification : నాడు చంద్రబాబు సాహసం..
2000-04 మధ్య అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను అమలు చేసింది. కానీ, మాలమహనాడు ఈ వర్గీకరణను వ్యతిరేకించి, హైకోర్టు మెట్లెక్కింది. హైకోర్టులో వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో 2004లో అనాటి రాష్ట్ర సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. చివరికి అక్కడ కూడా వర్గీకరణను వ్యతిరేకిస్తూ.. వివక్ష, వెనుక బడిన వారందరినీ ఒకే కేటగిరిలో ఉంచాలని ఆదేశించింది. దీంతో అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం పోరాటాలు ప్రజా ఉద్యమాలుగానూ, రాజకీయ ఉద్యమాలుగానూ రూపాంతరం చెందినా.. వర్గీకరణపై అడుగులు ముందుకు పడలేదు.
SC classification : అలుపెరుగని పోరాటం..
ఎస్సీ వర్గీకరణ కోసం గత మూడు దశాబ్దాలుగా మందకృష్ణ ఉద్యమిస్తూ వచ్చారు. దీనికోసం గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు తెలిపారు. మందకృష్ణ చేస్తున్న ఆలుపెరుగని పోరాటానికి ప్రధాని మోడీ కరిగిపోయి, ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించారు. గతేడాది హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మాదిగ విశ్వరూప మహాసభ’ సభకు ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా హాజరయ్యారు.
SC classification : చారిత్రాత్మక తీర్పునకు నాంది
ఈ పరిణామం అనంతరం.. ఆగస్టు 1, 2024న సుప్రీం కోర్టు మరోసారి చారిత్రాత్మక తీర్పునకు నాంది పలికింది. ఆ రోజు ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారించింది. వర్గీకరణ తప్పనిసరి చెబుతూనే.. ఈ అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అనివార్యమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తుది తీర్పునిచ్చింది.
SC classification : తీర్పు వెలువడిన వెంటనే..
సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించారు. ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలమని ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది.
SC classification : 82 రోజుల వ్యవధిలో..
2024 నవంబరు 11న బాధ్యతలు స్వీకరించిన కమిషన్ 82 రోజుల వ్యవధిలోనే అధ్యయనం పూర్తి చేసి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గతేడాది డిసెంబరు 4 నుంచి ఈ ఏడాది జనవరి 3 వరకు రాష్ట్రంలోని పూర్వ జిల్లాల్లో బహిరంగ విచారణ చేపట్టింది. ప్రజల విజ్ఞప్తులు స్వీకరించి, అభిప్రాయాలు తెలుసుకొంది. ఆయా ప్రాంతాల్లోని ఆవాసాలను సైతం నేరుగా సందర్శించింది.
అలా ప్రజల నుంచి నేరుగా వచ్చిన 4,750 వినతులతోపాటు హైదరాబాద్‌లోని విచారణ కమిషన్ కార్యాలయానికి 8,681 విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుంది. వీటితోపాటు ఎస్సీల్లోని 59 ఉప కులాల జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక, రాజకీయ ప్రాతినిధ్యం డేటాను కూడా అధ్యయనం చేసి, తుది నివేదికను రూపొందించింది.
SC classification : మూడు గ్రూపులుగా..
సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ గ్రూపులుగా వర్గీకరించింది. అత్యంత వెనుకబడిన కులాలను గ్రూపు-1లో, మధ్యస్థ లబ్ధిపొందిన కులాలను గ్రూపు-2లో, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూపు-3లో చేర్చి విభజించింది.
SC classification : రిజర్వేషన్ ఇలా..
2011 జనాభా గణాంకాల ఆధారంగా..
- ఎస్సీ జనాభాలో 3.28 శాతం ఉన్న 15 కులాలను గ్రూపు-1లో చేర్చి ఒక శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించింది.
- 61.967 శాతం ఉన్న మాదిగ కులంతో సహా 18 కులాలను గ్రూపు-2లో చేర్చి 9% రిజర్వేషన్లు ఇవ్వాలంది.
- 29.26 శాతం ఉన్న మాల, మాల అయ్యవార్ కులంతో సహా 26 కులాలను గ్రూపు-3 లో చేర్చి 5% రిజర్వేషన్లను ప్రతిపాదించింది.
SC classification : నాలుగు సిఫార్సులు..
సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సర్కారుకు నాలుగు సిఫార్సులు చేసింది.
మొదటిది : ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలంది.
రెండోది : ఉద్యోగాల భర్తీ సమయంలో ఖాళీగా మిగిలిన పోస్టులను తదుపరి ప్రకటనకు క్యారీఫార్వర్డ్ చేయాలంది.
మూడోది : ఎస్సీ కులాలకు రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాలని సూచించింది.
నాలుగోది : ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ను ప్రతిపాదించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు, మేయర్లు తదితర ప్రజాప్రతినిధులతోపాటు గ్రూప్-1 సర్వీసులో ఉన్న వారిని క్రీమీలేయర్ గా పరిగణించాలంది. వీరి రెండోతరానికి రిజర్వేషన్లు మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
కాగా, తొలి మూడింటిని ఆమోదించిన రాష్ట్ర సర్కారు.. నాలుగో దానిని తిరస్కరించింది.
SC classification : గత నెలలో..
ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ రూపొందించిన నివేదికను ఫిబ్రవరి 5న రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించింది. అదే రోజు ఉభయ సభలు కూడా తమ ఆమోదం తెలిపాయి. చివరికి మార్చి 18, 2025న తెలంగాణ అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణ బిల్లును ముక్త కంఠంతో ఆమోదించి, చారిత్రాత్మక అంశానికి తెర తీసింది. గవర్నర్ ఆమోదంతో ఇక ఎస్సీ వర్గీకరణ అంశం అమల్లోకి రానుంది.