అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించారు. మొత్తం ఎలక్టోరల్‌ ఓట్లు 538 కాగా.. అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే 270 ఓట్లు రావాల్సి ఉంటుంది. అయితే ట్రంప్‌ ఇప్పటికే 295 ఎలక్టోరల్‌ ఓట్లు సొంతం చేసుకుని తిరుగులేని విజేతగా నిలిచారు. ట్రంప్‌ ప్రత్యర్థి డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ 226 ఓట్ల వద్దే కొనసాగుతున్నారు.

సరికొత్త రికార్డు సొంతం

అమెరికా చరిత్రలో ట్రంప్‌ సరికొత్త రికార్డు సృష్టించారు. ఒక నేత రెండు సార్లు అధ్యక్ష పదవి చేపట్టడం చాలాసార్లు జరిగింది. కానీ ఒకసారి అధికారం చేపట్టాక, రెండోసారి ఓడిపోయి, మళ్లీ పోటీ చేసి గెలుపొందిన సందర్భం దాదాపు 132 ఏళ్లలో ఇదే మొదటిసారి.

కఠిన నిర్ణయాలతో వ్యతిరేకత

ట్రంప్‌ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న కఠిన నిర్ణయాలతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయన్ను విమర్శించారు. నియంతలా ప్రవర్తిస్తున్నారని అమెరికన్లలోనూ వ్యతిరేకత వచ్చింది. రెండోసారికి ఓడిపోయాక.. ఇక ఆయన పని అయిపోయిందనే అందరూ భావించారు. ట్రంప్‌నకు రాజకీయ జీవితమే లేదని అనుకున్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రారంభంలోనూ అదే అభిప్రాయం వ్యక్తం అయింది. ఆ తర్వాత ఆయన ఇచ్చిన ప్రసంగాలు, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న పరిణామాలు, మెల్లిగా లభిస్తున్న మద్దతు ఓటర్లను ఆలోచనల్లో పడేశాయి.

అక్రమ వలసలతో ఆందోళన

గతంలో ట్రంప్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండేదని గుర్తించారు. ఆ తర్వాత కోవిడ్‌ మహమ్మారి, ద్రవ్యల్బోణం వెలసి అక్కడి ప్రజలను ఆర్థిక చట్రంలో బంధించాయి. వీటికితోడు బైడెన్‌ హయాంలో అక్రమ వలసలు భారీగా పెరిగాయి. సరిహద్దు భద్రత విషయంలోనూ నెలకొన్న ఆందోళనలు ఓటర్లను ట్రంప్‌ వైపు మొగ్గు చూపేలా చేశాయి.

భారతీయుల మద్దతు ట్రంప్‌నకే..

కమలా హారిస్‌ తమిళ బ్రాహ్మణ మూలాలు ఉన్న మహిళ అయినప్పటికీ.. ఆ విషయాన్ని ఆమె ఎప్పటికీ అంగీకరించలేదు. అసలు భారత్‌తో తనకు సంబంధమే లేదని వ్యాఖ్యానించడంపై భారతీయ అమెరికన్లు గుర్రుగా ఉన్నారు. దీనికితోడు బైడెన్‌ కాలంలో వారు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఎందరో ఉద్యోగాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థికంగా కుదుటపడాలంటే.. ప్రపంచాన్ని ప్రభావితం చేసే గట్టి నాయకుడు కావాలని భావించారు. కమలా హారిస్ ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తే కావడంతో కొత్తగా మార్పు ఏదీ ఉండదని భావించారు. ఇది ట్రంప్ నకు అనుకూలంగా మారింది.

చైనాకు మూకుతాడు!

ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుగా చైనా ఎదగాలని చూస్తోంది. తన ఉత్పత్తులను యూరప్ వ్యాప్తంగా డంపు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే చైనా ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. ముఖ్యంగా డ్రాగన్ మన దాయాది దేశాలకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో భారత్‌కు ముప్పు పొంచి ఉంది. ట్రంప్ అధికారంలోకి వస్తే చైనాపై సుంకాలను పెంచుతానని వాగ్దానం చేశారు. ట్రంప్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే చైనాకు మూకుతాడు పడనుంది. తద్వారా పరోక్షంగా భారత్‌కు మేలు జరగనుంది.

అనిశ్చితి తొలగించాలే..

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉందనే భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ఆయా దేశాల మధ్య ఇప్పటికే యుద్ధాలు కొనసాగుతున్నాయి. దాడులు ప్రతిదాడులతో సామాన్యులు అల్లాడుతున్నారు. మరి మరోసారి అధికారం చేపట్టబోతున్న ట్రంప్.. అమెరికా విదేశాంగ విధానం రూపురేఖల్ని మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి రష్యా – ఉక్రెయిన్ల యుద్ధం ఆపుతారో.. లేదో వేచి చూడాల్సిందే. పశ్చిమ ఆసియాలోనైతే శాంతిని నెలకొల్పుతానని మాట ఇచ్చారు. గాజాలో ఇజ్రాయిల్ – హమాస్, లెబనాన్ లో ఇజ్రాయిల్ – హిజ్బుల్లా దాడులను అరికడతానని ట్రంప్ చెప్పారు.