అక్షరటుడే, ఇందూరు: RATION SHOPS | జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా సాగేలా పర్యవేక్షించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) అధికారులను ఆదేశించారు. నగరంలోని శివాజీనగర్(Shivajinagar)లో గల 21వ నంబర్ రేషన్ షాపును బుధవారం సందర్శించారు. లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు. స్టాక్ రిజిస్టర్ తనిఖీ(stock register Check) చేసి, దానికి అనుగుణంగా బియ్యం ఉందా అని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్(Collector) మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఏ ఒక్క దుకాణంలో సన్నబియ్యం నిల్వలు లేవని ఫిర్యాదులు రాకూడదన్నారు. రేషన్ కార్డులు(Ration Cards) కలిగిన 4 లక్షల కుటుంబాలకు.. ప్రతినెలా 8,248 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా అందిస్తున్నామన్నారు. బుధవారం మధ్యాహ్నం నాటికి మొత్తం కోటాలో 38శాతం పంపిణీ చేసినట్లు చెప్పారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, సహాయ అధికారి రవి రాథోడ్, రేషన్ డీలర్ హిమబిందు, డీలర్ల సంఘం జిల్లా కార్యదర్శి పార్థసారథి తదితరులున్నారు.