SLBC | ఎస్​ఎల్​బీసీ సహాయక చర్యల్లో రోబోలు

SLBC | ఎస్​ఎల్​బీసీ సహాయక చర్యల్లో రోబోలు
SLBC | ఎస్​ఎల్​బీసీ సహాయక చర్యల్లో రోబోలు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: SLBC | ఎస్​ఎల్​బీసీ సొరంగంలో మట్టి కూలి చనిపోయిన వారి మృతదేహాలను వెలికి తీయడానికి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బురద, నీరు, సొరంగం మళ్లీ కూలే ప్రమాదం ఉండటం లాంటి ప్రతికూల పరిస్థితులతో సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి. రోజుల తరబడి శ్రమిస్తున్నా ఒకరి మృతదేహం మాత్రమే లభ్యమైంది. దీంతో అధికారులు రోబోల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా డిజాస్టర్​ రోబోటిక్​ బృందాన్ని తీసుకొచ్చారు.

SLBC | కేరళ నుంచి డాగ్స్​ తెప్పించినా..

ఎస్​ఎల్​బీసీ సొరంగం పనులు చేపడుతుండగా గత నెల 22న మట్టి కూలి అందులో 8 మంది చిక్కుకున్న విషయం తెలిసిందే. వారు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. 8 మంది మృతదేహాల కోసం అప్పటి నుంచి గాలిస్తున్నారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో కేరళ నుంచి రెండు స్నిఫర్​ డాగ్స్​ తెప్పించారు. వాటి సాయంతో ఒక మృతదేహం లభ్యమైంది. అవి వాసన చూసి తిరిగిన ప్రాంతంలో మిగిలిన మృతదేహాలు ఉండే అవకాశం ఉంది.

SLBC | అనుకూలించని పరిస్థితులు

కేరళ డాగ్స్​ గుర్తించిన మరో రెండు ప్రాంతాల్లో మట్టి తవ్వడానికి ఇబ్బంది అవుతోంది. ఓ వైపు బురద ఉండటం, బోరింగ్​ మిషన్​ అడ్డుగా ఉండటంతో తవ్విన మట్టిని బయటకు తీసుకు రావడం కష్టం అవుతోంది. దీంతో అధికారులు మట్టి తరలింపు కోసం రోబోల సాయం తీసుకోవాలని నిర్ణయించారు. అన్వి రోబోటిక్​ బృందంతో పరిస్థితులను అంచనా వేశారు. ఈ మేరకు ఆరు రోబోలతో కూడిన డిజాస్టర్ రోబోటిక్ టీమ్​ను ఘటనా స్థలానికి చేర్చారు. టన్నెల్ దగ్గర మాస్టర్ రోబో ఏర్పాటు పనులు చేశారు. దాని సూచనల మేరకు లోపలకు వెళ్లిన రోబోలు పని చేస్తాయి. లోపల పేరుకుపోయిన బురద, మట్టిని అవి తీసుకు రానున్నాయి.

SLBC | భయం భయంగా..

సొరంగంలో సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ బృందాలు భయం గుప్పిట్లో ఉన్నాయి. ఓ వైపు నీటి ఊట వస్తుండడం, లోపల గాలి సరిపోకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా పలుచోట్ల సొరంగం మళ్లీ కూలే అవకాశం ఉండడంతో భయపడుతూ పనులు చేపడుతున్నారు. మట్టి కూలకుండా దుంగలను అడ్డుగా పెడుతున్నారు.

Advertisement