అక్షరటుడే, ఇందూరు: భారతదేశ చరిత్ర మహోన్నతమైనదని, ఇలాంటి చరిత్ర ఏ దేశానికి లేదని ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ తెలిపారు. ఇందూర్ విభాగ్ ఆధ్వర్యంలో నగరంలోని ఇంద్రాణి పాఠశాలలో కళాశాల విద్యార్థుల శిబిరం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్ర సతత సంఘర్షణ చరిత్ర అన్నారు. ఎంతోమంది మహోన్నతులైన దేశభక్తులు జన్మించారని, వారందరూ దేశం కోసం, ధర్మం కోసం తమ ప్రాణాలను వదులుకున్నారన్నారు. విదేశీ పాలనలో భారతదేశ మగ్గిపోవడానికి గల కారణాలను అన్వేషించిన డాక్టర్ హెడ్గే వార్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తిరిగి పరతంత్రం రాకుండా ఉండాలంటే దేశ సంస్కృతి, మూలాలను, చరిత్రను మర్చిపోకూడదని ఆర్ఎస్ఎస్ ను స్థాపించారన్నారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థుల శిబిర అధికారి గజానన్, ఇందూర్ విభాగ కార్యవాహ దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.
