• బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మకై నీచ రాజకీయాలు
  • మీడియా సమావేశంలో రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, నిజామాబాద్‌రూరల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్ర పన్నుతున్నాయని రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు కుమ్మకై నీచ రాజకీయాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు కేటీఆర్‌ కొన్ని రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ఎవరితో సంప్రదింపులు చేస్తున్నారో తమకు తెలుసన్నారు. మంగళవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో చేయలేని పనులను తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రూ.రెండు లక్షల రుణమాఫీ చేయనున్నామని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేశారని.. ప్రతి పథకం ద్వారా అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు తమ జేబులు నింపుకున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌, రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌ను అందిస్తున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు గడుగు గంగాధర్‌, మైనారిటీ నాయకులు జావిద్‌ అక్రం, కిసాన్‌ కేత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ముప్పగంగారెడ్డి, నాయకులు అమృతపూర్‌ గంగాధర్‌, విద్యాసాగర్‌, భోజన్న, బాకారం రవి, నరేశ్‌, ఎల్లయ్య, లింగం పాల్గొన్నారు.