అక్షరటుడే, ఆర్మూర్‌: సీఎం రేవంత్‌రెడ్డి ఆర్మూర్‌లోని సిద్ధులగుట్ట సాక్షిగా ప్రమాణం చేసి రైతులందరికీ రూ. 2లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించారని, ఇచ్చిన హామీ మేరకు సెప్టెంబర్‌ 15లోగా ఆంక్షలు లేకుండా రుణమాఫీ, రైతుభరోసా అందించాలని ఆర్మూర్‌ డివిజన్‌ ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టణంలోని కుమార్‌ నారాయణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రుణమాఫీ, రైతుభరోసా పేరిట యాప్‌ను ప్రవేశపెట్టి, రైతు కుటుంబాల వివరాలు నమోదు అంటూ ప్రభుత్వం కాలయాపన చేయాలని చూస్తోందన్నారు. ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన గడువులోగా డిమాండ్లు నెరవేర్చని పక్షంలో సెప్టెంబర్‌ 16నుంచి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలకు తీర్మానాలు చేస్తామన్నారు. సమావేశంలో రైతు ప్రతినిధులు ఇట్టడి లింగారెడ్డి, వి.ప్రభాకర్, యాదవ్, దేవరాం, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.