అక్షరటుడే, కామారెడ్డి: కనిపెంచిన పిల్లలు పట్టించుకోకపోవడంతో ఓ వృద్ధురాలు అందరూ ఉన్నా అనాథగా మారింది. కిందపడి చేయి విరిగిన ఆమెను ఆస్పత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు మళ్లీ అటు వైపు రాలేదు. దీంతో వైద్యులు, సిబ్బందే ఆమె బాగోగులు చూస్తున్నారు. మాచారెడ్డి మండలం కొత్తపల్లికి చెందిన గికూరి సాయవ్వకు ఇద్దరు కొడుకులు, కూతురు కాగా ఒక కొడుకు మృతి చెందాడు. మరో కొడుకు వెంకటేశ్, కోడలు, కూతురు ఉన్నారు. వీరు కొత్తపల్లిలో ఆస్తులన్నీ అమ్ముకుని పదేళ్లుగా కామారెడ్డిలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 18న సాయవ్వ కింద పడిపోవడంతో చేయి విరిగింది. సాయవ్వను కూతురు జిల్లా ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయింది. నాలుగు రోజులుగా ఆమె కోసం ఆస్పత్రికి వచ్చే వారే లేకుండా పోయారు. కొడుకు, కూతురుకు ఫోన్ చేసినా స్పందించడం లేదు. దీంతో ఆస్పత్రి వైద్య సిబ్బంది, పోలీస్ కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు వృద్ధురాలికి సేవలు చేస్తున్నారు.