అక్షరటుడే, జుక్కల్: కామారెడ్డి జిల్లాలో ఏటీఎం మిషన్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బిచ్కుందలోని ప్రధాన రహదారిపై ఉన్న ఎస్బిఐ బ్యాంకు ఏటీఎంలో అర్థరాత్రి చొరబడిన దొంగలు ఏటీఎం దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులకు చిక్కకుండా సీసీ కెమెరాలపై స్ప్రే కొట్టారు. మంగళవారం ఉదయం ఏటీఎం ధ్వంసం చేసి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలాన్ని బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ జగడం నరేష్, ఎస్సై మోహన్ రెడ్డి పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఓ క్వాలిస్ వాహనంలో నలుగురు నిందితులు వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఏటీఎంలో రూ.3.95 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. అయితే ఏటీఎం యంత్రాన్ని బిచ్కుంద పట్టణంలోని కమ్మరి చెరువు ప్రాంతంలో వదిలేసి వెళ్లినట్లు తెలిసింది. పక్కనే కర్ణాటక, మహారాష్ట్ర ఉండడంతో అక్కడి ముఠాలు దోపిడీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.