అక్షరటుడే, వెబ్‌డెస్క్: బొలీవియా(Bolivia)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా చెబుతున్నారు.
లాటిన్ అమెరికాలో జరుగుతున్న ఒరురో కార్నివాల్(Oruro carnival)కు బస్సులు వెళ్తుండగా.. కొల్చాని – ఉయుని రహదారిపై ఒకదాన్ని మరొకటి బలంగా ఢీకొట్టినట్లు స్థానిక మీడియా కథనం పేర్కొంది. బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో భారీ ప్రాణనష్టం జరిగింది.
Bolivia : భయానక వాతావరణం
ప్రమాద ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. రెండు బస్సుల డ్రైవర్లు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని బొలీవియా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.