అక్షరటుడే, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి ఓసీపీ-5 గని పట్టణానికి అతి సమీపంలో ఉండడంతో బొగ్గు బ్లాస్టింగ్ లు చేసినప్పుడు స్థానికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బొగ్గును వెలికితీసేందుకు చేపట్టే పేలుళ్లు సింగరేణి గనుల్లో సాధారణమే అయినా గత నాలుగు రోజుల నుంచి ఈ పేలుళ్ల తీవ్రత అధికంగా ఉంది. దీంతో భూమి కంపించినట్లు అనిపిస్తోందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పేలుళ్ల తీవ్రత కారణంగా ఇంటి పైకప్పు రేకులు, గోడలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. ప్రతీ రోజు సాయంత్రం మూడున్నర సమయంలో జరిగే బ్లాస్టింగ్‌లతో ఇళ్లలో ఉన్నవారు ఉలిక్కి పడుతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి తగిన చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.