అక్షరటుడే, ఇందూరు: రైల్వేలో లోకో పైలట్, అసిస్టెంట్‌ లోకో పైలట్లకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే డీఆర్‌ఎం లోకేష్‌ విష్ణోయ్‌ అన్నారు. నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన రన్నింగ్‌ రూంను గురువారం పరిశీలించి మాట్లాడారు. 2014 తర్వాత ప్యాసింజర్, గూడ్స్‌ రైళ్ల లోకో, అసిస్టెంట్‌ లోకోపైలట్లు, గార్డులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామ న్నారు. హైదరాబాద్‌ డివిజన్లో ఐదు రన్నింగ్‌ రూంలు అందుబాటులో ఉన్నాయన్నారు. నిజామాబాద్‌లోని రన్నింగ్‌ రూంలో లోకో పైలట్ల కోసం ఏసీ గదులు, యోగా, మెడిటేషన్‌ సౌకర్యాలున్నాయని, మహిళా పైలట్లకు ప్రత్యేక గదులున్నాయన్నారు. కొందరు సౌకర్యాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందుకే ఈ పర్యటన చేసినట్లు పేర్కొన్నారు. రన్నింగ్‌ రూంల్లో త్రీ స్టార్‌ హోటల్‌ తరహాలో పూర్తిస్థాయిలో అన్ని హంగులతో సౌకర్యాలు కల్పించామని, రూ.8కే రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. మిగిలిన రూ.72 సబ్సిడీ రాయితీ రైల్వే శాఖ భరిస్తుందన్నారు. రన్నింగ్‌ రూంలో అందిస్తున్న సౌకర్యాలపై సీనియర్‌ డీఎంఈ జీషాన్‌ అహ్మద్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం ప్రతి గదిని, యోగా హాల్‌ను తనిఖీ చేశారు. భోజనశాలను పరిశీలించి రుచి చూశారు. కార్యక్రమంలో సీనియర్‌ డీసీఎం అనిరుద్‌ పార్మార్, స్టేషన్‌ మేనేజర్, సిబ్బంది పాల్గొన్నారు.