అక్షరటుడే, ఇందూరు: క్రీడాభివృద్ధికి ఖేలో ఇండియా ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో సౌత్ జోన్ మహిళల సైక్లింగ్ లీగ్ పోటీలను ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఈ తరహా పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఖేలో ఇండియా ద్వారా అనేకమంది ప్రతిభ గల క్రీడాకారులు బయటపడుతున్నారన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ డైరెక్టర్ నిషా విద్యార్థి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కృపాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.