అక్షరటుడే, కామారెడ్డి: కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ సింధూశర్మ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేరాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ నేరస్తులను పిటి వారెంట్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టి సైబర్ బాధితులకు బాసటగా నిలవాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల బారినపడ్డ బాధితులు కోల్పోయిన డబ్బు త్వరగా రీఫండ్ అయ్యేలా చూడాలన్నారు. పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని పేర్కొన్నారు. తరచుగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేసి వారిపై నిఘా ఉంచాలన్నారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో రెండు వారాల స్టేషన్ రైటర్ శిక్షణ పూర్తి చేసుకున్న 18 మంది మహిళా అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.