అక్షరటుడే, కామారెడ్డి: డబ్బుల విషయమై తరచూ భర్త వేధించడంతో హత్య చేసిన కేసులో నిందితురాలికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి డా సీహెచ్ వీవీఆర్ వరప్రసాద్ తీర్పునిచ్చినట్లు ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.. పెద్ద కొడప్ గల్ మండలం కాస్లాపూర్ కు చెందిన తడకంటి సాయిలు, అతని భార్య అంజవ్వకు తరచూ డబ్బుల విషయమై గొడవ జరిగేది. ఈ క్రమంలో 2022, జూన్ 22న మళ్లీ తగాదా తలెత్తగా, అంజవ్వ మృతుడు సాయిలు తమ్ముడికి ఫోన్ చేసి తెలిపింది. ఉదయం వచ్చి మాట్లాడదామని చెప్పి, మరుసటి రోజు రాగా, అప్పటికే సాయిలు మృతి చెందాడు. దీంతో తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అంజవ్వను నేరస్తురాలిగా గుర్తించి అరెస్ట్ చేశారు. గురువారం కోర్టులో కేసు విచారణకు రాగా, నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన అప్పటి బిచ్కుంద సీఐ కృష్ణ , ఎస్సై విజయ్, ప్రస్తుత సీఐ నరేష్ కుమార్, ఎస్సై మహేందర్ ను ఎస్పీ అభినందించారు.

Advertisement
Advertisement
Advertisement