అక్షరటుడే, కామారెడ్డి టౌన్: ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ఏకాగ్రత ఎంతో అవసరమని ఎస్పీ సింధు శర్మ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బాల సదన్, బాలికల పాఠశాలలో దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఉన్నత లక్ష్యం సాధించడానికి ఏకాగ్రత అవసరమని, ఇష్టపడి చదివితే తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. బాలల దినోత్సవం సందర్భంగా నృత్యం, విజ్ఞానం, సృజనాత్మక రచన, ఆటలు, పాటలు లాంటి విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, జడ్పీ సీఈవో, జిల్లా సంక్షేమ అధికారి చందర్ నాయక్, కామారెడ్డి ఎస్ హెచ్ వో చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.