అక్షరటుడే, హైదరాబాద్: Sri Chaitanya College : శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం భారీ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి రూ. 230 కోట్ల మేరకు ఆదాయ పన్ను ఎగ్గొట్టినట్లు ఐటీ శాఖ గుర్తించింది. హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఐదు రోజులపాటు ఐటీ శాఖ సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో భారీగా అక్రమాలు వెలుగుచూశాయి.
Sri Chaitanya College : భారీగా ఆస్తుల కొనుగోలు..
శ్రీ చైతన్యలో జరిగిన ఐటీ సోదాల్లో అధికారులు రూ. ఐదు కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏడాది కాలంలో రూ. 230 కోట్లతో శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఐటీ సోదాల్లో నిర్ధారణ అయింది.
Sri Chaitanya College : పన్ను ఎగ్గొట్టేందుకు సాఫ్ట్ వేర్ వినియోగం..
విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నగదు రూపంలో ఫీజులు తీసుకుని భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు రెండు సాఫ్ట్ వేర్స్, ఆదాయ పన్ను చెల్లించేందుకు ఒక సాఫ్ట్ వేర్, పన్ను ఎగవేతకు తప్పుడు లెక్కలు చూపే మరొక సాఫ్ట్ వేర్ ను శ్రీ చైతన్య యాజమాన్యం ఏర్పాటు చేసుకున్నట్లు ఐటీ సోదాల్లో వెలుగుచూసింది.
Sri Chaitanya College : అడ్డగోలుగా ఫీజుల వసూళ్లు..
హైదరాబాద్లో కార్పొరేట్ కాలేజీలు ఏటా అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తున్నాయి. మొదటి ఏడాదికి, రెండో ఏడాదికి మధ్య భారీగా ఫీజుల వ్యత్యాసం ఉంటోంది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే సంవత్సరానికి రూ.30 వేల నుంచి రూ.60 వేల దాకా పెంచుతూ పోతున్నాయి. ఎంసెట్, ఐఐటీ జేఈఈ, సీఏ-సీపీటీ, నీట్(EAMCET, IIT JEE, CA-CPT, NEET) పేరిట తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నాయి.
Sri Chaitanya College : మొక్కుబడిగా తరగతులు..
ఆయా కోర్సుల పేరిట పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న జూనియర్ కాలేజీలు.. విద్యను అందించే విషయంలో మాత్రం మొక్కుబడిగా ఉంటున్నాయి. మంచిగా చదివే విద్యార్థులను ఒక్కచోటకు చేర్చి, ర్యాంకుల కోసం వారి మీదనే యాజమాన్యం ఫోకస్ చేస్తోంది. మిగతా బ్రాంచీలలో పరిస్థితి అధ్వానంగా ఉంటోంది. ఒక్కో తరగతి గదిలో 70 నుంచి 90 మంది విద్యార్థులను కూర్చోబెడుతున్నాయి. ఇంత మంది ఒకే గదిలో కూర్చుంటే ఫ్యాకల్టీ చెప్పేది విద్యార్థులకు ఎలా అర్థం అవుతుందనేది ఇటు యాజమాన్యాలు, అటు తల్లిదండ్రులు ఆలోచించడం లేదు.
Sri Chaitanya College : ఫ్యాకల్టీలపై ఒత్తిడి..
కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు.. ఫ్యాకల్టీల విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ఇచ్చే అరకొర వేతనాలకు రోజంతా పనిచేయాల్సిందే. ఒక చోట విధులు పూర్తి చేసుకుని, మరో చోటకు వెళ్లి పాఠాలు బోధించాల్సిందే. నిర్ణీత సమయంలో సిలబస్ పూర్తి చేయాల్సిందే. ఫలితంగా విద్యార్థులకు సబ్జెక్టు ఎంత వరకు అర్థం అయిందో పర్యవేక్షించే వారు కరవయ్యారు.