అక్షరటుడే, వెబ్‌డెస్క్: పోడు భూముల పంపిణీకి సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కలెక్టర్లకు సూచించారు. శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయా జిల్లాల్లో పోడుపట్టాల కోసం వచ్చిన దరఖాస్తులు, పరిష్కరించినవి, పెండింగ్ లో ఉన్నవాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు విడతలుగా పోడుపట్టాల పంపిణీ చేసినా.. ఇంకా గిరిజనుల నుంచి వినతులు వస్తున్నాయన్నారు. అర్హులైన కుటుంబాలకు పోడు పట్టాల పంపిణీపై సీఎంతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర వివరాలు అందించాలని ఆమె కలెక్టర్లను ఆదేశించారు.
అటవీ భూమి ఆక్రమణకు పాల్పడుతున్నారు: రాకేశ్‌రెడ్డి
సిరికొండ మండలం రావుట్లలో అటవీ భూమిలో యథేచ్ఛగా చెట్లు నరికివేసి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కాన్ఫరెన్స్‌లో మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆమె తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనిపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గంలో పోడు భూముల సమస్య ఉందని, మారుమూల గిరిజన తండాలు, అటవీ సరిహద్దు గ్రామాలకు రోడ్లు నిర్మించాలని, తాగునీటి వసతి కల్పించాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కోరగా మంత్రులు సానుకూలంగా స్పందించారు. వీసీలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా గిరిజన అభివృధ్ధి అధికారి నాగూరావు, అటవీ శాఖ డివిజనల్ అధికారి భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు.