అక్షరటుడే, వెబ్ డెస్క్: చాలామంది విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఎమ్మెస్ చేసేందుకు విదేశాలకు వెళ్తుంటారు. ఇక విదేశీ యూనివర్సిటీలే మన దేశానికి రానున్నాయి. ప్రత్యేకించి మన హైదరాబాద్ లోనే ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, ఫార్మా, ఐటీ కంపెనీలకు నిలయంగా మారిన రాష్ట్ర రాజధానికి ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్ లను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల విదేశీ పర్యటనలో అమెరికాలోని స్టాన్ ఫర్డ్ వర్సిటీ, యూకేకు చెందిన ఆక్స్ ఫర్డ్ యాజమాన్యాలతో సమావేశమై హైదరాబాద్ లో క్యాంపస్ లను నెలకొల్పాలని ఆహ్వానించారు. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలని, అందుకోసం టాప్ వర్సిటీల యాజమాన్యాలతో మాట్లాడి క్యాంపస్లు ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇటీవల సీఎం వెల్లడించారు.
గతేడాదే కేంద్రం అనుమతి..
మన దేశం నుంచి ఏటా 12 లక్షల మంది ఉన్నత విద్య కోసం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, జర్మనీ తదితర దేశాలకు వెళుతున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉంటున్నారు. ఈ క్రమంలో విదేశీ వర్సిటీల ప్రాంగణాలను దేశంలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2023 నవంబర్ లో అనుమతిచ్చింది. ప్రపంచ ర్యాంకింగ్ లో టాప్ 500 వర్సిటీలు యూజీసీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో దాదాపు 10కి పైగా వర్సిటీలు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాకు చెందిన డైకిన్ వర్సిటీ అహ్మదాబాద్ లోని గిఫ్ట్ సిటీలో క్యాంపస్ ఏర్పాటుకు యూజీసీ నుంచి అనుమతి పొందింది. అక్కడ ప్రస్తుత విద్యా సంవత్సరమే తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంగణంలో సైబర్ సెక్యూరిటీలో పీజీ కోర్సుకు 3,500 దరఖాస్తులు రావడం విశేషం. మన దేశంలో ప్రాంగణాన్ని ప్రారంభించిన తొలి విదేశీ వర్సిటీగా ఇది గుర్తింపుపొందింది.
- తాజాగా యూకేకు చెందిన సౌతాంప్టన్ యూనివర్సిటీ గురుగ్రామ్ లో క్యాంపస్ ఏర్పాటుకు యూజీసీ నుంచి ప్రాథమిక అనుమతి పొందింది.
- మలేషియా, కెనడా వర్సిటీలు సైతం దరఖాస్తు చేసి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి.
మలేషియాకు నుంచి కూడా..
రాష్ట్రంలో ప్రాంగణం ఏర్పాటుకు మలేషియాకు చెందిన లింకన్ వర్సిటీ కొద్ది నెలల క్రితమే యూజీసీకి దరఖాస్తు చేసింది. ఇది క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్ లో 301-340 పరిధిలో ఉంది. యూజీసీ ఇంకా దీనికి అనుమతివ్వలేదు. ఆ వర్సిటీని హైదరాబాద్ శివార్లలో నెలకొల్పే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇండియన్ బిజినెస్ స్కూల్, బిట్స్ పిలానీ క్యాంపస్, నల్సార్, ఐఐటీ, సెంట్రల్ వర్సిటీలతో ఇప్పటికే హైదరాబాద్ ఎడ్యుకేషన్ హబ్ గా మారింది. స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటికితోడు ప్రపంచస్థాయి వర్సిటీల ప్రాంగణాలు ఏర్పాటైతే.. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదిగేందుకు దోహదపడనుంది.