అక్షరటుడే, బోధన్‌/బాన్సువాడ: వైద్యులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌ సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సూచనల మేరకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని బాన్సువాడ, బోధన్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులను శుక్రవారం సందర్శించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి మౌలిక వసతులపై సిబ్బందిని, రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోగులకు మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌ల కొరత ఉందని చెప్పగా.. దీంతో ఆయన స్పందించి త్వరలోనే వారి నియామకాలు చేపడతామని తెలిపారు. ఆయన వెంట డీసీహెచ్‌ఎస్‌ శివ శంకర్‌, జిల్లా మలేరియా అధికారి తుకారాం రాథోడ్‌, ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ సుమన్‌, బాన్సువాడ ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఆర్‌ఎంవో సూఫీ, వైద్యులు సందీప్‌, విగ్నేశ్వర్‌, వైద్య సిబ్బంది ఉన్నారు.