అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఈరవత్రి అనిల్‌ అన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ శాఖల శకటాలను ప్రదర్శించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్, ఎంపీ అరవింద్, రూరల్ ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, రాకేశ్ రెడ్డి, నగర మేయర్ నీతూకిరణ్ ఇతర అధికారులతో కలిసి ఈరవత్రి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ప్రసంగించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నిజామాబాద్‌ జిల్లా మొదటి వరుసలో ఉందని పేర్కొన్నారు. రైతాంగం సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. వరంగల్‌ గడ్డపై తెలంగాణ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రైతు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. బోధన్‌ నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం మంత్రి శ్రీధర్‌ బాబు సారథ్యంలో కమిటీని వేశామని గుర్తుచేశారు. అలాగే జిల్లాలో అత్యధిక సంఖ్యలో గల్ఫ్‌ కార్మికులు ఉన్నారని.. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వారందరి సంక్షేమం కోసం త్వరలో గల్ఫ్‌బోర్డు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారన్నారు. గల్ఫ్‌ పాలసీ, గల్ఫ్‌ బోర్డు ఏర్పాటు ద్వారా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.

ఆరు గ్యారంటీల అమలు

ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని ఈరవత్రి అనిల్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3.82 కోట్ల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని వివరించారు. దీనిద్వారా మహిళలకు రూ.143 కోట్ల లబ్ధి చేకూరిందని వివరించారు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఈ పథకం వల్ల జిల్లాలో 21,534 మంది పేదలు చికిత్సలు పొందారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా వచ్చే సంవత్సరంలోగా ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మించనున్నట్లు తెలిపారు. గృహలక్ష్మి కింద రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 2,25,992 కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందని వివరించారు. గృహజ్యోతి కింద 13,84,046 కుటుంబాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని చెప్పారు.