అక్షరటుడే, వెబ్డెస్క్ :Vemulawada Temple | వేములవాడలోని రాజన్న ఆలయాన్ని(Vemulawada Rajanna Temple) అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయంలో వసతుల కల్పనతో పాటు, గుడిని విస్తరించాలని ప్రణాళికలు రూపొందించింది. మూడు దశల్లో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. కాగా ఈ పనులకు గతంలో సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) శంకుస్థాపన చేసి నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా తొలిదశ పనులు జూన్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి.
Vemulawada Temple | భీమేశ్వరాలయంలో దర్శనం
తొలిదశ అభివృద్ధి పనుల నేపథ్యంలో జూన్ 15 నుంచి ప్రధాన ఆలయంలోకి భక్తులకు(Devotees) అనుమతించరు. కేవలం నిత్య పూజలను మాత్రం అర్చకులు ప్రధాన దేవాలయ గర్భాలయంలో నిర్వహిస్తారు. భక్తులకు స్థానిక భీమేశ్వరాలయంలో స్వామి వారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి దశ పనులు దాదాపు రెండేళ్లలో పూర్తి అవుతాయాని సమాచారం. అప్పటి వరకు రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని ఉత్సవ మూర్తులను భీమేశ్వరాలయంలో ఉంచి భక్తులకు దర్శనాలు, పూజలు కొనసాగిస్తారు. కాగా ఈ పనులకు సంబంధించి అధికారులు గురువారం సమీక్ష నిర్వహించి, అనంతరం వివరాలు వెల్లడించనున్నారు.
Vemulawada Temple | భారీగా నిధులు అవసరం
శృంగేరీ శంకరమఠం పీఠాధిపతి సూచించిన మార్పులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని కొత్త ఆలయ నిర్మాణాన్ని ప్రభుత్వం(Government) చేపట్టనుంది. ప్రధాన గర్భాలయం, మండప భాగాన్ని అలాగే ఉంచి చుట్టూ కొత్త మండపాన్ని నిర్మించనున్నారు. ధర్మగుండం, గుడి చెరువు ప్రాశస్త్యం తగ్గకుండా 40 ఎకరాల పరిధిలో నిర్మాణాలు చేపట్టనున్నారు. అన్నదాన సత్రం, క్యూ కాంప్లెక్సు, వసతి గృహాలు, కార్యాలయం, కోనేరు, కల్యాణ కట్ట, కోడె మొక్కుల ప్రాంతం కొత్తగా నిర్మించనున్నారు. వేములవాడలోని అన్ని అనుబంధ ఆలయాలను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ పనులకు రూ.550 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన దేవాలయానికి సంబంధించి రూ.76 కోట్లు, కల్యాణ మండపానికి రూ.33 కోట్లు మంజూరు చేసింది. ఇటీవలి బడ్జెట్(Budget)లో మరో రూ.100 కోట్లు ప్రతిపాదించింది. కేంద్రం నుంచి ‘ప్రసాద్’పథకంలో భాగంగా వసతి గృహ నిర్మాణానికి రూ.44 కోట్లు మంజూరయ్యాయి.