అక్షరటుడే, కామారెడ్డి: kamareddy medical college | మెడికల్ కళాశాలలో ఉద్యోగ నియామకాలు జరిగాయంటూ విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. శుక్రవారం బీడీఎస్ఎస్, ఎస్ఎఫ్ఐ, జీవీఎస్, బీవీఎం సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను ముట్టడించారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పడంతో పోలీసులు అనుమతిచ్చారు. దీంతో మెడికల్ కళాశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. గతంలో కూడా ఇలాగే జరిగితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా.. పాత నోటిఫికేషన్ ప్రకారమే దరఖాస్తులు స్వీకరించారన్నారు. అనంతరం ఇష్టారాజ్యంగా నియామకాలు చేపట్టారన్నారు. రూ. లక్షల్లో డబ్బులు తీసుకుని.. మెడికల్ కళాశాలలో సిబ్బంది బంధువులకే ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు.
అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చాక మెరిట్‌లిస్ట్ ఇవ్వడంపై ఉన్నాధికారులు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని.. మ్యాన్‌పవర్ ఏజెన్సీపై విచారణ జరిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో బీవీఎం రాష్ట్ర కార్యదర్శి విఠల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్, జీవీఎస్ జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్, బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, సురేష్, మణికంఠ, అర్భాస్ ఖాన్, ప్రభాకర్, మణికంఠ, రాహుల్, శివ, శ్రావణ్, అజయ్ పాల్గొన్నారు.