అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sunita Williams | భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మరికొద్ది గంటల్లో భూమికి చేరుకోనుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు సునీతా విలియమ్స్ సహా వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమిపై అడుగు పెట్టనున్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ISS) ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్లారు. అయితే సాంకేతిక సమస్యతో వారు తొమ్మిది నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు.
Sunita Williams | ట్రంప్ ఆదేశాలతో..
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వీరిని తీసుకురావడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేయడంతో , స్పేస్‌ఎక్స్ రంగంలోకి దిగి ‘క్రూ-10 మిషన్’ చేపట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష కేంద్రం నుంచి వారు తిరిగి భూమి మీదకు చేరుకోనున్నారు. వారి వ్యోమనౌక ఇప్పటికే భూమి మీదకు తిరుగు ప్రయాణం అయింది. మరికొద్ది గంటల్లో వారు ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ కానున్నారు.
Sunitha Williams | స్ట్రెచర్‌పైనే బయటకు..
సుదీర్ఘ కాలం అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, విల్మోర్ భూమి మీదకు రాగానే వారిని స్ట్రెచర్‌పై తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారు భూ వాతవరణానికి అలవాటు పడటానికి కొంతకాలం పట్టే అవకాశం ఉంది. అలాగే అక్కడ జీరో గ్రావిటీలో ఉన్న వారు భూమి మీదకు చేరుకున్నాక నడిచే అవకాశాలు లేనట్లు సమాచారం. దీంతో వారిని స్ట్రెచర్‌పై ప్రత్యేక ఆస్పత్రికి తరలించి వైద్యం అందించనున్నారు.