అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : భారత్‌ సెక్యూలర్‌ దేశమని.. ఆక్రమణల తొలగింపు, బుల్డోజర్‌తో చర్యలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒక్కటేనని సుప్రీం బెంచ్‌ పేర్కొంది. నేరగాళ్ల ఇళ్లపై బుల్డోజర్‌ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఇవాళ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారించింది. రోడ్లు, జలాశయాలు, రైలు ట్రాక్‌లను ఆక్రమించిన ఏ మత సంబంధ కట్టడాలైనా తొలగించాల్సిందేనని.. ప్రజల రక్షణే ముఖ్యమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. యూపీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు హాజరయ్యారు. ఏదైనా నేరంలో వ్యక్తి ఉంటే అతని ఇంటిపై బుల్డోజర్‌ చర్యలు తీసుకోవడానికి ఆధారామా అని సొలిసిటర్‌ను బెంచ్‌ ప్రశ్నించింది. కచ్చితంగా కాదని.. అత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాల్లో నిందితులైనా సంబంధం లేదని సొలిసిటర్‌ సమాధానం ఇచ్చారు. ఇందుకు న్యాయస్థానం స్పందిస్తూ మనది సెక్యూలర్‌ దేశమని, మా మార్గదర్శకాలు జాతిమతాలతో సంబంధం లేకుండా అందరికీ వరిస్తాయని స్పష్టం చేసింది. ఏదైనా మత సంబంధమైన నిర్మాణం రోడ్డు, ఫుట్‌పాత్‌, జలాశయం, రైలు పట్టాలపై ఉంటే అది ప్రజలకు అడ్డంకిగా ఉంటుందని.. అక్రమ నిర్మాణాల విషయంలో అందరికీ ఒక్కటే చట్టం అని కీలక వ్యాఖ్యలు చేసింది.