అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తమిళ సినీ నటుడు దళపతి విజయ్‌ స్థాపించిన పొలిటికల్‌ పార్టీ తొలి బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. తమిళ వెట్రి కజగం పార్టీ తొలి మహానాడు కార్యక్రమం ఆదివారం విల్లూపురం జిల్లా విక్రవండిలో ఆశేష అభిమానుల మధ్య జరిగింది. ఈ మహానాడులో తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు పాము లాంటివని, పార్టీలో అందరూ సమానమేనని పేర్కొన్నారు. సినిమా రంగం, రాజకీయం వేర్వేరు అని తేల్చి చెప్పారు. రాజకీయం అంటే యుద్ధభూమి అని, తాడోపేడో తేల్చుకునేందకు వచ్చానని తెలిపారు. పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఒకటే కులం.. ఒకరే దేవుడు అనేది తన పార్టీ భావజాలమన్నారు. తాను రాజకీయాల్లో చిన్న పిల్లాడినే కావచ్చు కానీ ఎవరికీ భయపడేది లేదని తేల్చిచెప్పారు.