అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPO | టాటా గ్రూప్‌నకు చెందిన టాటా క్యాపిటల్(TATA CAPITAL) ఐపీవోకు సిద్ధమవుతోంది. ఈ మేరకు సెబీకి కాన్ఫిడెన్షియల్ ప్రీ ఫైలింగ్ పద్ధతిలో ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 15వేల కోట్లు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. కొత్త షేర్ల జారీతోపాటు ఆఫర్ ఫర్ సేల్(Offer for sale) పద్ధతిలో నిధుల సమీకరణ జరగనుంది.
IPO | సెప్టెంబర్‌లోపే..
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీలు మూడేళ్లలో పబ్లిక్ మార్కెట్‌లో లిస్ట్ కావాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ టాటా క్యాపిటల్‌ను అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా 2022 సెప్టెంబర్‌లో గుర్తించింది. దీని ప్రకారం ఈ సంస్థ ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా తప్పనిసరిగా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవ్వాలి ఉంది. ఈ నేపథ్యంలో టాటా క్యాపిటల్ ఐపీవోకు రావాలని నిర్ణయించింది. సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించింది.
IPO | ఫైనాన్షియల్ సెక్టార్‌లో అతిపెద్ద ఐపీవో!
టాటా క్యాపిటల్ ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 15వేల కోట్లు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 2.3 కోట్ల ఈక్విటీ షేర్లను ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) ద్వారా జారీ చేయనుండడంతోపాటు ప్రస్తుత వాటాదారులు తమ వాటాలను కొంత తగ్గించుకోనున్నారు. ప్రస్తుతం టాటా క్యాపిటల్‌లో టాటా సన్స్‌కు 93 శాతం వాటా ఉంది. సెబీ ఆమోదం పొంది పబ్లిక్ ఇష్యూకు వస్తే.. ఫైనాన్షియల్ సెక్టార్(Financial sector)లో ఇది అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది.