అక్షరటుడే, భీమ్‌గల్ : BHEEMGAL | తరగతి గదిలో అల్లరి చేస్తున్నాడని ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా దండించాడు. ఈ ఘటన భీమ్‌గల్ మండలం పల్లికొండ ఉన్నత పాఠశాలలో బుధవారం చోటు చేసుకుంది. విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలోని ఏడో తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు భూమేశ్వర్ తన క్లాస్ లో అల్లరి చేస్తున్నాడని తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం తెలిపాడు.
దీంతో వారు గాయాలపాలైన బాలుడిని భీమ్గల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ఎంఈవో స్వామికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై హెచ్ఎం అనురాధను వివరణ కోరగా.. తనకు ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. గాయపడిన స్టూడెంట్ తండ్రి ఫోన్లో తనకు సమాచారం ఇచ్చారన్నారు. తాను కూడా ఎంఈవోకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.