అక్షరటుడే, హైదరాబాద్: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను శాస్త్రవేత్తలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేం దుకు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. బుధవారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 110 రైతు వేదికల్లో వీసీ సౌకర్యాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన నాలుగు రైతు వేదికలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొలం దున్నడం నుంచి మొదలు పెడితే పంట చేతికి వచ్చే వరకు రైతులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటల వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో 26 రకాల పంటలు సాగుచేసేందుకు నేలలు అనుకూలంగా ఉన్నాయన్నారు. రైతులు కేవలం వరి, పత్తి, మిర్చి పంటలే కాకుండా ఇతర పంటలను సాగు చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలు శాస్త్రవేత్తలు, అధికారులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అందిస్తారన్నారు. ప్రస్తుత సంవత్సరం కరువు పరిస్థితులు ఉన్నాయని.. రైతులు నష్టపోకుండా ఉండేందుకు త్వరలో పంటల బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు. జిల్లా నుంచి వీసీలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు.
