అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ మాజీ స్పీకర్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి వెళ్లడం ఖాయమైంది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు శుక్రవారం పోచారం ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీలోకి ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే పోచారం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఆయన కీలక నేతగా వ్యవహరించారు. బాన్సువాడతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఆయనకు గట్టి పట్టుంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోగా.. ఉమ్మడి నిజామాబాద్‌ నుంచి కేవలం బాన్సువాడలో పోచారం, బాల్కొండ నుంచి ప్రశాంత్‌ రెడ్డి మాత్రమే గెలుపొందారు. తాజాగా రేవంత్‌ రెడ్డి పోచారం ఇంటికి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేకాకుండా జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి సైతం కాంగ్రెస్‌లోకి వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.