కాంగ్రెస్‌ పాలనలో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్తు వ్యవస్థను నాశనం చేసిందని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాకే కరెంట్‌ కోతలు మొదలయ్యాయని, ఫలితంగా ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వచ్చాయని పేర్కొన్నారు. తమహయాంలో హైదరాబాద్‌ను పవర్‌ ఐలాండ్‌ సిటీగా మార్చామని గుర్తు చేశారు. ఒకప్పుడు పవర్‌ పోతే వార్త అని, ఇప్పుడు పవర్‌ ఉంటే వార్తగా మారిందన్నారు. సూర్యాపేట జిల్లాలో కేసీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న కరెంట్‌, మిషన్‌ భగీరథను వాడుకునే తెలివి లేదన్నారు. ఈ కారణంగానే రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. తమహయాంలో అద్భుతంగా ఉన్న తెలంగాణ కేవలం మూడు నెలల్లోనే ఇలా అవుతుందని ఆనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేతలకు రాజకీయాలు చేసే సమయం ఉంది గానీ రైతుబంధు వేసే తీరిక లేదని వ్యాఖ్యానించారు. ఒకవైపు రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇంకోవైపు సీఎం ఢిల్లీ యాత్రలకు సరిపోతున్నారని విమర్శించారు. ప్రస్తుతం పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం ధర్నాలు, నిరసనలు తెలిపి ప్రభుత్వం మెడలు వంచుతామని ఆయన పేర్కొన్నారు. కేవలం చిల్లర రాజకీయాల కోసం కాళేశ్వరం నీళ్లను కిందకు వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, దీనికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమన్నారు. రూ.500 బోనస్‌ చెల్లించి పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తిరిగి 6న నియోజకవర్గ కేంద్రాల్లో ఒకరోజు దీక్ష చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రైతులందరు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని అమలు చేసే వరకు ఉద్యమం చేద్దామని పేర్కొన్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలను లాక్కొన్నంత మాత్రాన ఏమీ కాదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.