అక్షరటుడే, ఇందూరు: తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థినులు తినే అల్పాహారంలో ఓ కీటకం దర్శనమిచ్చింది. శుక్రవారం ఉదయం బాలికల వసతి గృహంలో అల్పాహారం తింటున్న సమయంలో ఓ విద్యార్థిని ప్లేటులో కీటకం బయటపడింది. దీంతో విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే విషయం బయటికి పొక్కకుండా అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. శనివారం ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనపై స్పందించిన వర్సిటీ అధికారులు కిచెన్ హెడ్ కుక్ రాజేశ్ ను విధుల నుండి తొలగించారు. చీఫ్ వార్డెన్ ఆదేశాల మేరకు హాస్టల్ కేర్ టేకర్ విచారణ నిర్వహించి రిజిస్ట్రార్ కు శనివారం నివేదిక అందజేశారు. అనంతరం హెడ్ కుక్ ను విధుల నుంచి తొలగించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి అధికారికంగా ప్రకటించారు. మిగిలిన సిబ్బంది విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కిచెన్ గదిలో పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.