అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిజామాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా) ఛైర్మన్‌గా నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కేశ వేణు నియామకం దాదాపు ఖాయమైంది. అతి త్వరలోనే నియామక ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలిసింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నిజామాబాద్ అర్బన్‌ నియోజకవర్గానికి చెందిన కేశ వేణు పార్టీలో అత్యంత సీనియర్‌ నాయకుడు. సుదీర్ఘకాలంగా ఆయన పార్టీ కోసం పనిచేస్తున్నారు. కాగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్‌ నుంచి టికెట్‌ ఆశించారు. పార్టీ అధిష్టానం చివరి నిమిషంలో షబ్బీర్‌అలీకి టికెట్‌ కట్టబెట్టడంతో ఆయన కోసం పనిచేశారు. పార్టీ అధికారంలోకి వస్తే నామినేటేడ్‌ పదవి ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నుడా ఛైర్మన్‌ పదవి ఆయనకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నుడా పరిధిలో నిజామాబాద్‌ అర్బన్‌తో పాటు ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల్లోని పలు గ్రామాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో నగర అభివృద్ధిలో నుడా పాత్ర అత్యంత కీలకం కానుంది. ఈ నేపథ్యంలో పార్టీకి అత్యంత నమ్మకంగా ఉన్న కేశ వేణును ఈ పదవికి ఎంపిక చేసినట్లు తెలిసింది.