అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో ఓ డీఎస్పీ తీరు వివాదస్పదమైంది. ఓ వ్యక్తి నుంచి రూ. 20 లక్షలు కాజేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా.. ఈ విషయం ఉన్నతాధికారుల చెంతకు చేరడంతో ఆయన్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు తెలిసింది. శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేటు వేశారని ప్రచారం జరుగుతోంది.
వ్యక్తి నుంచి డబ్బులు వసూలు
కామారెడ్డి డీసీఆర్‌బీలో పనిచేసే సమయంలో డీఎస్పీ మదన్‌లాల్‌కు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దగ్గరయ్యాడు. తాము ఇటీవల ఓ దొంగల ముఠాను పట్టుకున్నామని.. తమ వద్ద కిలోకుపైగా బంగారం ఉందని.. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని సదరు వ్యక్తిని నమ్మించాడు. దీంతో ఆ వ్యక్తి రూ. 20 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది. అనంతరం బంగారం ఇవ్వకపోగా రేపుమాపు అంటూ కాలం వెళ్లదీశాడు. డబ్బులు సైతం తిరిగి ఇవ్వలేదు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా ఆయన్ను డీసీఆర్‌బీ విభాగం బాధ్యతల నుంచి తప్పించారు.
సస్పెన్షన్ వేటు!
ఇదిలా ఉండగా.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర పోలీసు బాస్ డీఎస్పీ మదన్‌లాల్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. ఇప్పటికే యూనిట్ అధికారికి ఈ విషయమై సమాచారం అందింది. కాగా.. డీఎస్పీ తీరు జిల్లా పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.