అక్షరటుడే, వెబ్ డెస్క్: తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారులకు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్(క్యాట్)లో చుక్కెదురైంది. డీవోపీటీ(డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) సంస్థ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..
తమను తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 11 మంది కేంద్ర సర్వీస్ అధికారులు(ఐఏఎస్, ఐపీఎస్) గతంలో డీవోపీటీని అభ్యర్థించారు. ఇందుకోసం డీవోపీటీ ఏకసభ్య కమిటీని వేసి పరిశీలన చేపట్టింది. కమిటీ నివేదికను అనుసరించి సదరు అధికారులు ఈనెల 16న ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ సదరు అధికారులు క్యాట్ ను ఆశ్రయించారు. మంగళవారం విచారణ చేపట్టిన క్యాట్ డీవోపీటీ ఆదేశానుసారం రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో వరదలతో ప్రజలు అల్లాడుతున్నారని గుర్తు చేసింది. వారికి సేవ చేయాలని లేదా? అని నిలదీసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డీవోపీటీ ఉత్తర్వులను పాటించాలని క్యాట్ తీర్పునిచ్చింది.