అక్షరటుడే, హైదరాబాద్: పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలు, ప్రకృతిసిద్ధ పర్యాటక ప్రాంతాలకు సమీపంలో ఉన్న నివాస ప్రాంత వాసులకు చక్కని ఉపాధి కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు వచ్చే దేశ, విదేశాల టూరిస్టులకు స్థానికులే విడిది కల్పించేలా ‘ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్'(‘హోం స్టే’)పథకానికి శ్రీకారం చుట్టాయి. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తాజాగా తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో రాష్ట్రంలో అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు హోం స్టే నిర్వహించే పర్యాటక ప్రాంతాల్లోని ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఇంటి వాతావరణంలో విడిది
పర్యాటక ప్రాంతాల్లో స్టే చేయాలనుకునే సందర్శకులకు ‘ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్లో’ భాగంగా.. ఇంట్లోనే విడిది(హోం స్టే) కల్పించాల్సి ఉంటుంది. సందర్శకులకు ఇంటి యజమాని అక్కడే ఆవాసం కల్పించడంతో పాటు స్థానికంగా వండిన ఆహారం అందించాలి. అంటే వారికి స్థానిక ఆహార పదార్థాలను పరిచయం చేయడంతో పాటు పర్యాటక అనుభూతిని కల్పించాలి. దీంతోపాటు విడిది కోసం అన్ని సౌకర్యాలతో ప్రత్యేకంగా కనీసం ఒక గదినైనా కేటాయించగలగాలి.
వసతుల కల్పనకు ఆర్థిక సాయం
హోం స్టే కల్పించే ఔత్సాహికులు ముందుగా తెలంగాణ టూరిజం హోం స్టే ఎస్టాబ్లిష్ మెంట్(www.telanganatourism.gov.in)లో ఎన్రోల్ చేసుకోవాలి. అనంతరం తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు ‘హోం స్టే’ను పరిశీలిస్తారు. ఆ తరువాత టూరిజం డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేస్తారు. ప్రత్యేక గదుల ఏర్పాటు, మరమ్మతులు, ఇతర సదుపాయాల కల్పనకు రూ.3 – 5 లక్షల వరకు ఆర్థికసాయం అందజేస్తారు.
గోల్డ్, సిల్వర్ కేటగిరీలు
హోం స్టేలో వసతుల ఆధారంగా గోల్డ్, సిల్వర్ కేటగిరీలుగా విభజిస్తారు. అల్పాహారం నుంచి డిన్నర్ వరకు ఎలాంటి ఆహారం అందిస్తారో.. దానికి సంబంధించిన ఛార్జీలను డిస్ప్లే చేయాలి. ఆ వివరాలను అధికారులకు అందజేస్తే.. పర్యాటకులకు ముందస్తుగా వివరించి ‘హోం స్టే’కు అనుమతిస్తారు.