అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశంలోని ప్రజలందరికీ పెన్షన్ వర్తించేలా కొత్త పథకం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులతో పాటు అందరికీ పింఛన్ అమలు చేయాలని కేంద్ర కార్మిక శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న కొన్ని పథకాలను విలీనం చేసి కొత్త పథకం రూపొందించనున్నట్లు తెలిసింది. నిర్మాణ రంగ కార్మికులు, ఇళ్లలో పనిచేసేవారు, గిగ్‌వర్కర్లకు ప్రస్తుతం పెన్షన్ లేదు. కొత్త పింఛన్ పథకంతో వీరికి మేలు జరగనుంది.
ఆ పథకాల స్థానంలో..
అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రస్తుతం అటల్ పెన్షన్ యోజన పథకం ఉంది. అయితే ఇందులో కార్మికులు ప్రతినెలా కొంత మొత్తం జమ చేస్తే కేంద్రం కూడా అంతే మొత్తం వేస్తుంది. 60 ఏళ్ల తర్వాత జమైన డబ్బుల ఆధారంగా పెన్షన్ ఇస్తారు. అలాగే వీధి వ్యాపారుల కోసం ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్‌ధన్ యోజన, రైతుల కోసం కిసాన్ మాన్‌ధన్ యోజన వంటి పెన్షన్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటి స్థానంలో అందరికీ వర్తించేలా కొత్త పథకం తీసుకు రావాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.
ఎన్పీఎస్పై ఆందోళన వద్దు
కేంద్రం కొత్త పింఛన్ పథకం తీసుకు వస్తుందనే వార్తలతో ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీం) రద్దు అవుతుందేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆ పథకం అలాగే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న అందరికీ ఒకే తరహా పెన్షన్ అమలు కోసం ఈ పథకం రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పింఛన్ పథకాలను ఇందులో విలీనం చేస్తే కేంద్రం ప్రోత్సహించనుంది. దీంతో లబ్ధిదారులకు పింఛన్ మొత్తం పెరిగే అవకాశం ఉంది.