అక్షరటుడే, వెబ్ డెస్క్: అర్హులకే ఆహార ధాన్యాలు అందేలా కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. దేశ వ్యాప్తంగా ఈకేవైసీ వెరిఫికేషన్ల ద్వారా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులను గుర్తించి తొలగించింది. దీనికోసం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) ను డిజిటలైజేషన్ చేసింది. దీంతో పాటు ఈపీఓఎస్ యంత్రాలను సమకూర్చింది. తద్వారా నకిలీ రేషన్ కార్డులను ఏరివేసింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా పీడీఎస్ వ్యవస్థలో నకిలీలను నివారించేందుకు చర్యలు చేపట్టింది.

ప్రపంచానికే దిశానిర్దేశం

డిజిటైజేషన్ వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ స్థాయిలో మార్పులు వచ్చాయని, తద్వారా ఆహార భద్రతలో ప్రపంచానికే దిశానిర్దేశం చేసినట్లయిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పీడీఎస్ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా 80.6 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. ఇప్పటి వరకు 20.4 కోట్ల రేషన్ కార్డుల డిజిటలైజేషన్ పూర్తయ్యింది. 99.8 శాతం కార్డులను ఆధార్తో ఆనుసంధానం చేశారు. బయోమెట్రిక్ ప్రమాణీకరణతో 98.7 శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తయింది.

వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టం…

ఆహార పదార్థాల సరఫరా విషయంలోనూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పకడ్బందీగా వ్యవహరిస్తోంది. సరకు రవాణాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టంను రైల్వేలతో అనుసంధానించింది. మొత్తంగా వన్ నేషన్.. వన్ రేషన్ ను పక్కాగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.