Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: నిజామాబాద్​ జిల్లా జక్రాన్​పల్లి విమానాశ్రమయం ఏర్పాటు కలగానే మిగిలిపోనుంది. ఎయిర్​పోర్టు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశించిన స్థానికులకు నిరాశే మిగలనుంది. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు గురించి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రతిపాదనలకే పరిమితమైంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం వరంగల్ మామునూరు విమానాశ్రయానికి అనుమతి ఇచ్చింది. అయితే జక్రాన్​పల్లి గురించి కేంద్రం కనీసం ప్రస్తావించకపోవడంతో ఆ ప్రతిపాదనలు బుట్టదాఖలు అయినట్లేనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రిపోర్టు ఇచ్చినా..

జక్రాన్​పల్లి వద్ద ఎయిర్​పోర్టు కట్టవచ్చని ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నో ఎకనామికల్ రిపోర్ట్ ఇచ్చింది. దీనికోసం 1612.75 ఎకరాలు భూమి అవసరం అని పేర్కొంది. ఇక్కడ విమనాశ్రయం కట్టడానికి అన్ని విధాలుగా సాధ్య పడుతుంది అని రిపోర్టు ఇచ్చినా.. అడుగులు మాత్రం ముందుకు పడటం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి విమానాశ్రయం ఏర్పాటు చేయడం గురించి ఎటువంటి అనుమతి కూడా రాలేదు. ఈ మేరకు న్యాయవాది మాచర్ల విజయ్​ సామ్రాట్ జక్రాన్​పల్లి ఎయిర్​పోర్టు గురించి ఏవియేషన్ అధికారులను ఆర్టీఐ కింద వివరాలు కోరగా వారు స్పందించారు. విమానాశ్రయం కోసం ఇప్పటి వరకు ఒక్క ఎకరం భూసేకరణ కూడా జరగలేదని ఆయన రాసిన లేఖకు అధికారులు సమాధానం ఇచ్చారు. దీని కోసం ఎటువంటి నిధులు విడుదల కాలేదని పేర్కొన్నారు. పనులు చేపట్టడానికి సమయం కూడా పెట్టలేదన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Anil Eravathri | నేతన్నల రుణమాఫీ చేసి ‘రుణం’ తీర్చుకున్నారు: ఈరవత్రి అనిల్​

ప్రతిపాదన రాలేదు..

జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టుకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర సహాయ మంత్రి మురళీధర్‌ మొహోల్‌ గతంలో ఓ సారి లోక్‌సభలో ఎంపీ అర్వింద్‌ అడిగిన ప్రశ్నకి బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా విమానాశ్రయాల నిర్మాణానికి ఆరు చోట్ల ఫ్రీ ఎలిజిబిలిటీ అధ్యయనం నిర్వహించిందని తెలిపారు. ఇందులో వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో బ్రౌన్‌ ఫీల్డ్‌, నిజామాబాద్‌ జిల్లాలో గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయ నిర్మాణానికి సాంకేతికంగా వీలున్నట్లు గుర్తించిందని తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఇతర రెగ్యులేటరీ, చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతులు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏఏఐ సూచించిందని మంత్రి పేర్కొన్నారు. అయితే తాజాగా వరంగల్​ విమానాశ్రయానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.

Advertisement