అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెంగీ వ్యాధి నిర్ధారణకు సంబంధించిన రాపిడ్ కిట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సీతారాంనగర్ కాలనీలో గల అర్బన్ హెల్త్ సెంటర్ ను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. ఆస్పత్రిలోని రిజిస్ట్రేషన్ కౌంటర్, అవుట్ పేషంట్, ఇన్-పేషంట్ విభాగాలు, వివిధ వార్డులను సందర్శించారు. మధుమేహం నిర్ధారణ, రక్తపరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరాతీశారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్ వో తుకారం రాథోడ్, డాక్టర్ అంజన తదితరులున్నారు.