అక్షరటుడే వెబ్‌డెస్క్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈమేరకు పలువురు బీజేపీ నేతలపై ఢిల్లీలోని తుగ్లక్‌ రోడ్డు పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అజయ్‌మాకెన్‌ ఫిర్యాదు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ‘‘రాహుల్‌ గాంధీని ఉగ్రవాది అని పిలుస్తూ పలువురు ఎన్డీఏ నేతలు, వారి మిత్రపక్షాలు ఆయనపై దాడిచేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాహుల్‌ దేశంలో పలు సమస్యలపై కేంద్రాన్ని నిరంతరం ప్రశ్నిస్తున్నారు. ఇది బీజేపీ దాని మిత్రపక్షాలకు నచ్చక రాహుల్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల్లో అశాంతి నెలకొనేెలా చేయడానికి కుట్రలు పన్నుతున్నారు’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 11న రాహుల్‌పై బహిరంగ బెదిరింపులకు పాల్పడిన బీజేపీ నేత తర్విందర్‌ సింగ్‌, రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్‌ బిట్టు, శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు.