Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్​: ఏసీబీకి చిక్కిన లింగంపేట ఎస్సై సుధాకర్​ అవినీతి ఆరోపణలు అన్నీఇన్నీ కావు. కాసులు లేనిదే ఏ కేసూ ముట్టుకోడని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతి కేసులోనూ డబ్బులు డిమాండ్​ చేయడంతో పాటు అక్రమార్కుల నుంచి మామూళ్లు వసూలు చేయించేవాడని సమాచారం. ప్రత్యేకించి పలు కేసుల్లో బయట వ్యక్తుల నుంచి డబ్బులు అడగాలని సిబ్బందిని పురమాయించేవాడని తెలుస్తోంది. దీంతో సిబ్బంది ఎవరికీ చెప్పుకోలేక విసిగివేసారిపోయారు. తాజాగా ఓ వ్యక్తి నుంచి రూ.12,500 లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీకి దొరికిపోయాడు. వాస్తవానికి ఆయన ఆ సమయానికి ఆన్​ డ్యూటీలో లేడు. సెలవులపై వెళ్లిన ఆయన నిజామాబాద్​లో ఉండగా.. అక్కడ లంచం డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డాడు. దీంతో ఈయన ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నడో తాజా ఘటనే సాక్షాత్కరిస్తోంది.

వైద్య ఉద్యోగి కేసులో రూ.50వేలు!

వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఓ కాంట్రాక్ట్​ ఉద్యోగి డీఎంహెచ్​వో అని చెప్పి లింగంపేట మండలంలో పలువురు ఆర్​ఎంపీల వద్ద డబ్బులు వసూలు చేశాడు. మెడికల్​ ఆఫీసర్​గా పరిచయం చేసుకుని పలువురిని బెదిరించడంతో పాటు పెద్ద మొత్తంలో వసూలుకు పాల్పడ్డాడు. ఈ విషయమై ఓ ఆర్​ఎంపీకి అనుమానం రాగా వెంటనే ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చాడు. ఆరా తీసిన అధికారులు అతడిపై లింగంపేట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఎస్సై సుధాకర్​ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఓ అధికారే ఈ రాయభారం నడిపి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.50వేలు ఎస్సైకి సమర్పించడం కొసమెరుపు. ఇలా ప్రతి కేసులోనూ ఎస్సై సుధాకర్​ కాసుల కోసం కక్కుర్తి పడటమే చివరికి ఆయన్ను కటకటలాపాలు చేసిందని సొంత స్టేషన్ సిబ్బంది చర్చించుకుంటున్నారు.

Advertisement