అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలను చవిచూస్తున్నాయి. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు వరుసగా నెట్ సెల్లర్లుగా నిలుస్తుండడంతో మన ఇండెక్స్‌లపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. దీంతో గతనెల 27న ప్రారంభమైన పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. మన మార్కెట్లు కుప్పకూలకుండా డీఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు శత విధాలా ప్రయత్నిస్తున్నా పతనం ఆగడం లేదు. ఈనెలలో బీఎస్‌ఈలో నమోదైన షేర్ల మార్కెట్ విలువ సుమారు రూ. 35 లక్షల కోట్లు తగ్గడం గమనార్హం.
జీవిత కాల గరిష్టాల నుంచి..
గతనెల 27న సెన్సెక్స్ 85,978 పాయింట్ల వద్ద, నిఫ్టీ 26277 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్టాలను తాకాయి. ఆ రోజు నుంచే మార్కెట్లలో పతనం ప్రారంభమైంది. దాదాపు రోజూ ఇండెక్స్‌లు పడిపోతూనే ఉన్నాయి. శుక్రవారం సెన్సెక్స్ 79,402 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24,180 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫారిన్ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలోంచి ఇన్వెస్ట్‌మెంట్‌లను తగ్గించుకుంటూ జపాన్, తైవాన్, చైనా వంటి దేశాలకు సంపదను తరలిస్తున్నారు. రూపాయి విలువ పడిపోతుండడం, ఇజ్రాయిల్ – పాలస్తీనా మధ్య యుద్ధంతో అంతర్జాతీయంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి నెలకొనడం.. భారీ ఐపీవోల రాకతో సెకండరీ మార్కెట్లలో లిక్విడిటీ తగ్గడం వంటి అంశాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. అలాగే అమెరికా ఎన్నికల ప్రభావం కూడా మన మార్కెటపై కనిపిస్తోంది. ఇటీవల నిర్వహించిన సర్వేల ఆధారంగా ట్రంప్ గెలుస్తాడన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఆయన గెలిస్తే అమెరికా ఫస్ట్ నినాదానికి ప్రాధాన్యత ఇస్తారన్న భావనతో డాలర్, బాండ్ ఈల్డ్స్ బలపడుతున్నాయి. దీనికి తోడు మన మార్కెట్‌లోని చాలా కంపెనీల క్యూ2 ఫలితాలు నిరాశపరచడం, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగుతుండడంతో ఆయా స్టాక్‌లు పడిపోతున్నాయి. ప్రస్తుతం మన ఇండెక్స్‌లు రెండున్నర నెలల కనిష్టానికి చేరాయి.
భారీ పతనాన్ని అడ్డుకుంటున్న దేశీయ ఇన్వెస్టర్లు
మన మార్కెట్లు కోవిడ్ తర్వాత అతి పెద్ద పతనాన్ని చూస్తున్నాయి. అయితే మార్కెట్లు భారీగా పతనం కాకుండా దేశీయ ఇన్వెస్టర్లు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కోవిడ్ సమయంలో 45 రోజుల్లో ఇండెక్స్ లు 35 శాతం పడిపోయాయి. స్మాల్ అండ్ మిడ్ కాప్ ఇండెక్స్ లు 50 శాతానికి పైగా నష్టపోయాయి. ఆ సమయంలో ఫారిన్ ఇన్వెస్టర్లు రూ. 60 వేల కోట్ల స్టాక్స్ అమ్మగా డీఐఐలు సుమారు రూ. 55వేల కోట్ల స్టాక్స్ కొన్నారు. ప్రస్తుతం అక్టోబర్లో ఎఫ్ఐఐలు రూ. లక్ష కోట్లకుపైగా స్టాక్స్ అమ్మగా డీఐఐలు రూ. 97 వేల కోట్ల స్టాక్స్ కొన్నారు. ప్రస్తుతం ఫారిన్ ఇన్వెస్టర్లు ఇంతగా అమ్మకాలకు పాల్పడుతున్నా ఇండెక్స్ లు గరిష్ట స్థాయిల నుంచి 8 శాతం మాత్రమే తగ్గడం గమనార్హం. అయితే చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్ల వద్ద స్మాల్ అండ్ మిడ్ కాప్, పీఎస్ యూ స్టాక్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ స్టాక్స్ భారీగా పడిపోవడంతో వారంతా ఎక్కువగా నష్టపోయారు.
రికవరీ అయ్యేనా..?
మార్కెట్లలో పతనం త్వరలోనే ఆగవచ్చన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నిఫ్టీ 24,073 పాయింట్ల వద్ద రివర్స్ అవడంతో ఇక్కడ బేస్ ఫార్మ్ కావొచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగితే 23,500 పాయింట్లకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.