అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cabinet Expansion | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ వీడటం లేదు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కొలువుదీరి 16 నెలలు కావొస్తున్న ఇప్పటి వరకు పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువు దీరలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మంత్రివర్గ విస్తరణపై అనేక వార్తలు వస్తున్నాయి. ప్రక్రియ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు.
ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ(AICC) పెద్దలతో చర్చలు జరిపారు. దీంతో మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పిందని, ఉగాది తర్వాత కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా పీసీసీ అధ్యక్షుడు(PCC President) మహేశ్ గౌడ్(Mahesh Goud) స్పందించారు.
Cabinet Expansion | కొన్ని ఇబ్బందులు ఉన్నాయి..
మంత్రివర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్నారు. ఆ ఇబ్బందులు తొలగిపోయాక, త్వరలోనే ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ప్రాంతాలు, కులాలు అన్నీ పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణ చేపడుతామని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో మైనారిటీలకు అవకాశం ఉంటుందన్నారు. ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించాలని కోరినట్లు ఆయన తెలిపారు.
Cabinet Expansion | ఎవరి ప్రయత్నాలు వారివే..
మంత్రివర్గంలో చోటు కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ కోటాలో వివేక్ వెంకటస్వామికి పదవి ఇస్తారని ప్రచారం జరగడంతో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పెద్దలను కలిశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఒక పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తుంది. దీనిపై ఇటీవల మాజీ మంత్రి జానారెడ్డి అధిష్టానానికి లేఖ కూడా రాశారు. మైనార్టీ కోటాలో.. షబ్బీర్ అలీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.