నటీనటులు: విశ్వక్సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేశ్, హైపర్ ఆది, హర్ష వర్ధన్, సంగీతం: జేక్స్ బిజోయ్, సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి కాటసాని, ఎడిటింగ్: అన్వర్ అలీ, నిర్మాత: రామ్ తాళ్లూరి, రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి

కథనం ఏంటంటే..

రాకేశ్ అలియాస్ రాకీ (విశ్వక్సేన్) బీటెక్ మధ్యలో ఆపేసిన యువకుడు. తండ్రి రామకృష్ణ(నరేశ్ వీకే) నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్ గా పనిచేస్తుంటాడు. డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మాయ(శ్రద్ధా శ్రీనాథ్), ప్రియ(మీనాక్షి చౌదరి) వస్తారు. ప్రియ రాకీ స్నేహితుడు చెల్లెలు. చదువుకునేటప్పుడు ఆమెను ప్రేమిస్తాడు. చాలా రోజుల తర్వాత కలిసిన ప్రియ గురించి అతనికి ఏం తెలుస్తుంది.. ఆమె కోసం ఏం చేస్తాడు.. వీరి మధ్యలో మాయ పాత్ర ఏంటి అనేది తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

విశ్వక్సేన్.. అతి తక్కువ కాలంలో యూత్, మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పేరు సంపాదించుకున్నారు. కానీ ఇటీవల అతను ఎంచుకున్న సినిమాలు ఆకట్టుకోలేకపోతున్నాయి. గ్యాంగ్ ఆఫ్ గోదావరి ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. ప్రేక్షకులు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న గామి సైతం నిరాశపరిచింది. ఇక మెకానిక్ రాకీ కాస్త అదే కోవలోకి చేరుతుందా అనిపిస్తోంది. ఫస్టాఫ్ కాస్త బోర్ గా ఫీల్ కాక తప్పదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మొత్తంగా ఫస్టాఫ్ కామెడీ, పాటలతో కొనసాగి.. అసలు కథలోకి ప్రేక్షకులు లీనం కాకుండా చేస్తాయి. ఈ చిత్రానికి సెకండాఫ్ బలం. ద్వితీయార్థంలో చోటుచేసుకునే మలుపులు రక్తి కట్టిస్తాయి. ఫస్టాఫ్ లో బోర్ గా ఫీలయిన ప్రేక్షకులు సెకండ్ హాఫ్ తో సంతృప్తి చెందుతారు.

ఎవరి పాత్ర ఎలా ఉందంటే..

విశ్వక్సేన్ తన నటనతో ఆకట్టుకుంటారు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కు మంచి కథ ఉన్న పాత్రలు ఇచ్చారు. సునీల్, నరేష్, హర్షవర్ధన్, రోడీస్ రఘు, హర్ష చెముడు తమ పాత్రలకు అనుగుణంగా నటనతో మెప్పిస్తారు. మొత్తంగా నిర్మాణం బాగున్నా.. ‘పాత్రలకు అనుగుణంగా ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసేలా చిత్రీకరిస్తే బాగుండేది’ అని అనిపిస్తుంది.

– నరేష్ చందన్