అక్షరటుడే, వెబ్‌డెస్క్: ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి కృషి ఫలించింది. నియోజకవర్గంలో పలు చోట్ల నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో వసతులు లేక పంపిణీకి నోచుకోలేదు. ఇటీవల భైంసాకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆయనకు సమస్య వివరించారు. దీంతో మంత్రి కలెక్టర్, అధికారులతో సమీక్షించారు. డబుల్ బెడ్రూం ఇళ్లను సైతం పరిశీలించి, వసతుల కల్పనకు నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇవ్వగా, ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే నిధులు మంజూరు కానున్నట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. బైంసా పట్టణంతోపాటు ముధోల్, హంపోలి, దేగాం, కామోల్, మాటేగాం, హల్దా, మాలేగాం, రాజురా, సంఘ్వి, లింబాబి, పెంచికల్ పాడ్, కుప్టి, వర్ని, వడ్తాల్ ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూం ఇళ్లలో వసతుల కల్పనకు నిధులు రానున్నట్లు పేర్కొన్నారు. నిధులు మంజూరు కాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తారని తెలిపారు.