అక్షర టుడే, వెబ్‌డెస్క్‌: తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తుండగా, సుబ్రహ్మణ్యస్వామి తరపున రాజశేఖర్‌ రావు వాదించారు. ఈ క్రమంలో ధర్మాసనం పలు కీలక ప్రశ్నలను సంధించింది. కల్తీ జరిగినట్లు తేలిన నెయ్యి ట్యాంకర్‌ను అనుమతించలేదని టీటీడీ చెబుతోందని, ఇందుకు విరుద్ధంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో తెలియకుండా సీఎం చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేసిన తర్వాత సీఎం మీడియా ఎదుట ప్రకటనలు ఎందుకు చేశారని నిలదీసింది. ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు పాస్‌ కాకపోతే ట్యాంకర్‌ను లోపలికి అనుమతించబోమని టీటీడీ చెబుతుందన్నారు. కల్తీ జరిగిందని చెబుతున్న శాంపిళ్లను ఎక్కడి నుంచి సేకరించారని, తిరస్కరించిన ట్యాంకర్‌ నుంచి సేకరించారా..? అని ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ తయారీలో వాడినట్లు ఎలా తెలిసిందని, తయారైన లడ్డూలను టెస్టింగ్‌కు పంపించారా అని ప్రశ్నించింది. ఈకేసులో రాజకీయ జోక్యంపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయాల్లో దేవుడి ప్రస్తావన ఎందుకు అని.. దేవుడిని రాజకీయాల నుంచి దూరం పెట్టాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సిట్‌ సరిగ్గా విచారణ జరపగలదో లేదో అనే అనుమానం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై విచారణ జరిపితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.